Daily verses devotions

1 రాజులు రెండవ అధ్యాయములో సొలొమోను, తన సవతి తల్లి కుమారుడైన అదోనియాను (1రాజులు 2:19-27), యోవాబును (1రాజులు 2:28-35), షిమీనును (1రాజులు 2:36-46) చంపి తన పరిపాలనను ఆరంభించెను. ఈవిధముగా ఆరంభించుట ఎంత బాధాకరము! ఇట్టి నాశన మార్గమున ఆరంభించుటకు, దేవుని హృదయానుసారుడైన దావీదే సొలొమోనుకు చెప్పెను. ఇటువంటి పరిశుద్ధపరచబడని ద్వేషమువలన అనేకులు చెడిపోవుచున్నారు. అయినప్పటికీ దేవుడు తనను ఆశీర్వదించునని సొలొమోను ఊహించెను (1రాజులు 2:45). ఇక్కడ ఒక వ్యక్తి ఏవిధముగా మోసపోగలడో చూడగలము.

 

3వ అధ్యాయము:  ఒకసారి తప్పుడు మార్గములో మనము ఆరంభించినయెడల, దేవునినుండి ఇంకా ఇంకా దూరముగా వెళ్ళిపోవుదుము. తరువాత అన్యురాలైన ఫరో కుమార్తెను సొలొమోను పెళ్ళి చేసుకున్నాడు. దావీదు తన చివరి దినములలో సొలొమోనుతో పగతీర్చుకొనుట గురించికాక జ్ఞానము కలిగి పెళ్ళిచేసుకొనమని చెప్పినయెడల, సొలొమోను జీవితము ఎంత వేరుగా ఉండేది. మీ పిల్లలకు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? నీ జీవితములో అన్నిటికంటే ముఖ్యవిషయాలు ఏమిటి?

 

సొలొమోను యెహోవాయందు ప్రేమ యుంచెను గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచుండెను (1రాజులు 3:3) అని చదువుచున్నాము. ఇది ఎంత విరుద్ధము? ఆ విధముగా సద్దుబాటు చేసుకున్నాడు కాబట్టి సొలొమోను తననుతాను నాశనము చేసుకొన్నాడు. దేవాలయములో ఒకవిధముగా మరియు వ్యక్తిగత జీవితములో మరొకవిధముగా ద్వందజీవితమును జీవించాడు. ఈనాడు అనేక క్రైస్తవులు కూడా అలాగే జీవించుట చాలా బాధాకరము. ప్రభువునందు వారికున్న ప్రేమనుగూర్చి గొప్పగా చెప్పెదరు. కాని వ్యక్తిగత జీవితములో వారు దుర్నీతితోను మరియు పాపముతోను జీవించెదరు. చివరకు వారి జీవితములో ఇవే పెద్దవిగా మారి వారిని నాశనము చేయును.

 

సొలొమోను దేవుని మందిరమును ఏడు సంవత్సరములలో కట్టించాడు (1రాజులు 6:38). తన స్వంత ఇంటిని మాత్రము 13సంవత్సరములు కట్టించాడు (1రాజులు 7:1). దీనినిబట్టి సొలొమోను దేనికి ఎక్కువ విలువ ఇచ్చాడో తెలియుచున్నది. ఈనాడు క్రైస్తవ పనివారికి ఈ వివరణ బాగుగా సరిపోతుంది. వారు ''క్రైస్తవపని'' చేయుదురు మంచిదే కాని వారి ముఖ్యమైన ఆసక్తి వారి ఇంటిమీద మరియు వారి కుటుంబ సౌఖ్యములమీద ఉండును. కాని దేవునిపని మరియు దేవుని మందిరము వాటి తరువాత మాత్రమే ఉండును. సువార్తను బోధించుట ద్వారా వారు ధనవంతులు అయ్యారు.

 

అందరిలోవలె సొలొమోనులో భయభక్తులు క్రమక్రమముగా తగ్గుచుండెను. ప్రజలను చంపుచు తన పరిపాలన ఆరంభించాడు. షిమీని మరియు మోయాబును చంపకుండా ఉండుటకు తాను కోరినయెడల తన తండ్రియైన దావీదుతో సులభముగా అంగీకరించకుండా ఉండేవాడు. అతడు అదోనియాను క్షమించి మరియు ఆమెను చంపకుండా ఉండేవాడు. ఒకసారి అతడు దిగజారుటకు ఆరంభించి తరువాత, అతడు అంతకంతకు ఎక్కువగా దిగజారెను. తరువాత బహుశా అతడు ఆస్థికొరకు ఫరో కుమార్తెను పెళ్ళాడెను. అప్పుడు తన ఇల్లు కట్టుటకు 13 సంవత్సరములు గడిపాడు. దేవుడు అతనికి ఎంతో జ్ఞానము ఇచ్చినప్పటికీ అతడు ఈ విధముగా చేసాడు.

 

క్రైస్తవ పనివారు కొందరు వారి జీవిత ఆరంభమునుండి లోకములోనికి ఆకర్షింపబడటము నేను చూశాను. వారు పరిచర్య ఆరంభించినప్పటినుండి వారి సొంతమునే కోరుదురు. కొన్ని సంవత్సరముల తరువాత వారిని చూచినట్లయితే వారు వారి సొంతమును వెదకుటలో ప్రవీణులైయుందురు.

 

వారి రాజు వెనుకంజ వేసినప్పటికీ దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు కాబట్టి మందిరము పూర్తి అయినప్పుడు, దేవుడు తన మహిమతో దానిని నింపెను (1రాజులు 8:10). మోషే ప్రత్యక్ష గుడారము పూర్తి చేసినట్లయితే, సొలొమోను ఆ మందిరమును పూర్తిచేసాడు. ప్రత్యక్ష గుడారము కట్టినట్లే మందిరము కూడా కట్టబడెను గాని చాలా పెద్దదిగా కట్టబడెను.

 

సొలొమోను చాలా మంచి ప్రార్థన చేసాడు (1రాజులు 8:22-61). అప్పుడు దేవుడు రెండవసారి అతనికి కనబడి నీ ప్రార్థన నేను వినియున్నానని చెప్పి, నీ రాజ్యము స్థిరపరచబడునట్లు నీతితోను మరియు యదార్థహృదయముతోను నడచుకొనుము. కాని నన్ను వెంబడించుట మానినయెడల ఈ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి, సామెతగాను మరియు హేళనగాను చేయుదును (1రాజులు 9:3-9).

 

అదేవిధముగా బాబెలోనీయులు వచ్చి యూదాను చెరపట్టి మరియు మందిరమును నాశనము చేసిరి. దేవుడు వారిని ఈవిధముగా హెచ్చరించెను: ''నీ ఇష్టము వచ్చినట్లు నీవు జీవించుచున్నప్పటికీ నేను ఆశీర్వదిస్తూనే ఉంటానని నీవు అనుకొనవద్దు''. మనము తప్పిపోవుటకంటే ఎంతో ముందుగానే దేవుడు మనలను హెచ్చరించాడు.

 

పదవ అధ్యాయములో, సొలొమోను జ్ఞానమును గూర్చి వినిన షీబాదేశపు రాణి ఆయనను కలుసుకొన్నది. తాను జ్ఞాని అని లోకమంతట ప్రసిద్ధిచెందినను, అతని జీవితము సరిగాలేదు. చాలామంది క్రైస్తవులవలె, సమాజములో ఉన్నప్పుడు అతడు మంచి ప్రార్థనలు చేసాడు. కాని తన వ్యక్తిగత జీవితములో అనేకమంది క్రైస్తవుల వలె దేవుడు లేని అన్యుడుగా ఉండెను. సమ్సోనువలే కామతప్తుడై-700 మంది భార్యలు కలిగి మరియు 300 మంది ఉంపుడు గత్తెలను (ఎక్కువమంది అన్యులు) ఉంచుకొనెను (1రాజులు 11:1-3). వారిలో ఒక్కొక్కరిని బహుశా మూడు సంవత్సరములకు ఒకసారి కలిసేవాడేమో! ఆ భార్యలు అతనిని ప్రభువునుండి తొలగించి, విగ్రహములవైపు త్రిప్పిరి.

 

సొలొమోను తప్పిపోయినందున దేవుడు కోపగించి, తన రాజ్యమును రెండుగా విభజించెదనని చెప్పాడు (1రాజులు 11:9). దావీదు దైవజనుడైనందున, సొలొమోను జీవితకాలమున ఆవిధముగా జరిగించలేదు (1రాజులు 11:12). తండ్రులు భయభక్తులు కలిగియుంటే, వారి పిల్లలు ఎంతగా ఆశీర్వదించబడతారో ఇక్కడ చూచుచున్నాము. సొలొమోనుకు ఇబ్బంది కలుగునట్లు శత్రువులను పంపినప్పటికీ అతడు పశ్చాత్తాపపడలేదు (1రాజులు 11:14). యరొబాము తనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తాడని సొలొమోను భయపడి యరొబామును చంపుటకు ప్రయత్నించెను (1రాజులు 11:26). తరువాత యరొబాము విభజింపబడిన రాజ్యమునకు రాజు అయ్యాడు. ఆవిధముగా సొలొమోను చనిపోయెను (1రాజులు 11:43).

 

రచయిత

 

జాక్ పూనెన్

Comments

You must be logged in to post a comment.

About Author
Recent Articles
Apr 14, 2024, 3:53 PM John Carlo Rabanes
Apr 14, 2024, 3:52 PM Hicham
Apr 14, 2024, 3:51 PM Batiancila, Sara S.
Apr 14, 2024, 3:50 PM Batiancila, Sara S.